Poli Swargam Date -Poli Padyami Date and Tithi Time

Submitted by subhash on Wed, 12/08/2021 - 08:58
Poli Padyami 2022 Date

కార్తీకమాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ ‘పోలిస్వర్గం’.   కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి …. నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి..నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతఃకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు. బియ్యపుపిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలిస్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు.

Poli Padyami Date and Tithi Time | Poli Swargam Puja Time

Date Thursday, November 24, 2022
Tithi Margashirsha Shukla Paksha Padyami (Poli Padyami)
Tithi Time Nov 24, 04:27 AM - Nov 25, 01:37 AM
Poli Padyami 2022 / Poli Swargam Time Between 5 AM to 8 AM on November 24, 2022

పోలిస్వర్గం కథ:

ఈ పర్వదినానికి పోలిస్వర్గం అని ఎందుకు వచ్చిందో అని తెలిపేందుకు ఒక కథ వుంది. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది.ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా … ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి.

పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీకమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది.

అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.

కార్తీకమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తీకమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి.

చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీకమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తీకదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది.  ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది.

అప్పుడే నదీ స్నానం చేసి ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ… ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.

ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి… టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు.

ఆశ్వీయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతః కాలమే లేచి నదీ స్నానం చేసి దీపములు వెలిగించలేని వారు , ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారఝూమునేలేచి నదిలో స్నానమాచరించి అరటి దొప్పలలో దీపములు వెలిగించి వదిలి పెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుఝామున నదీ స్నానమాచరించిన ఫలితం, దీపములు వెలిగించినంతఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే…. మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కూడా చెబుతారు.

వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.  ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది.

భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందుకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ… పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

Youtube Video ID
KQyZ0-SdsqE
Meta Title
Poli Swargam Eppudu | Poli Swargam 2022 Date | Poli Padyami 2022 Date
Display Title
పోలి పాడ్యమి 2022 తేదీ మరియు తిథి సమయం, పూజ విధానం